KTR: కేటీఆర్ కు హైకోర్టులో చుక్కెదురు..! 1 d ago

featured-image

TG : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫార్ములా ఈ-రేసు ఘటనలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 31న అన్నివైపులా వాదనలు ముగించిన హైకోర్టు.. మంగళవారం తీర్పు ఇచ్చింది. ఈమేరకు ఉన్నత న్యాయస్థానం తీర్పుపై కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చిస్తున్నారు. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.

ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శ‌న్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని కోర్టుకు తెలిపారు. ఈ కార్ల రేసింగ్ సీజన్ 10 ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారని తెలిపారు. దర్యాప్తు ఏ దశలో ఉందని ఈ నేపథ్యంలో ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని.. అన్ని ఆధారాలు బయటపడతాయని ఏజీ పేర్కొంది. నిందితులు అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటివరకు నిందితులు ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని, ఈ కేసులో ఎవరిని అరెస్టు చేయలేదని ఏజీ అన్నారు. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ధర్మాసనానికి ఏజీ స్పష్టంచేశారు.

కేటీఆర్ తరుపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ దవే వాదనలు వినిపించారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్ కు వర్తించవని కోర్టుకు వెల్లడించారు. నగదు బదిలీలో కేటీఆర్ ఎక్కడా లబ్ధిపొందలేదని, అవినీతి జరిగినట్లు కూడా ఎఫ్ఐఆర్ లో ఎక్కడా పేర్కొనలేదని చెప్పారు. ఫార్మూలా-ఈ కార్ల రేసు నిర్వహణపై జరిగిన ఒప్పందంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ఫార్ములా- ఈ ఆపరేషన్స్ సంస్థ సంతకాలు చేశాయని ఆయన వాదించారు. పురపాలక శాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కేటీఆర్ ను ఎఫ్ఐఆర్ లో నిందితుడిగా చేర్చడం తగదని అన్నారు. ఈ మేరకు పలు హైకోర్టు తీర్పులను సిద్ధార్థ్ దవే ప్రస్తావిస్తూ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరారు.


Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD